స్మితం, హసితం ఉత్తమమైన నవ్వులు. విహసితం, ఉపహసితం మధ్యమమైనవి. అపహసితం, అతిహసితం అధమమైనవి- అని చెప్పారు. తిక్కన నవ్వుగాని నవ్వు, సెలవి వార నవ్వు, పెద్ద నవ్వు... అంటూ చాలా నవ్వులు పేర్కొన్నాడు. ఆచార్య రవ్వా శ్రీహరి అన్నమయ్య కీర్తనలలో వందకు పైగా నవ్వులున్నాయన్నారు. 'హాస్యబ్రహ్మ' భమిడిపాటి కామేశ్వరరావు నవ్వు గురించి పరిశోధన చేసి చెప్పిన పలుకులివి-
''నవ్వేటప్పుడు ముఖం వికసించం- కళ్ళు పెద్దవి అవడం, లేకపోతే సగం అవడం, కనుబొమలు పైకి జరగం, దవడలు లేవడం, ఎడం అవడం, తలటెక్కింపు, ఝాడింపు, దంత దర్శనం, ఒక వేళ పళ్ళు పొడుగ్గా ఉంటే అప్పుడు వాటిని ఆచ్చాదన చెయ్యడం, ఇముడని కట్టు పళ్ళైతే వాటిని తీసి చేత్తో పుచ్చుకోవడం, భుజాలు ఎగరెయ్యడం, మెలికలు తిరగడం, దుంప తెగిపోనూ మొదలైన మాటలతో తిట్టుకేకలు, కూతలు, అరుపులు, చప్పట్లు, బాదులు ప్రక్క వాళ్ళని దిగిదోవడం, కళ్ళ నీళ్ళు తుడుచుకోవడం, పొట్ట నొప్పి తమాయించనికి అబ్బ! అబ్బ! ఉండు, ఉండు అంటూ తెమలకుండా మాట్లాడడం వంటివి నవ్వే సమయంలో కనిపిస్తాయి''.
నవ్వుల్లో కుక్క కూత నవ్వులు, కప్ప బెక బెకల నవ్వులు, గుఱ్ఱపు సకిలింపు నవ్వులు, 'గ్యాస్' నవ్వులు, రైలింజను నవ్వులు, దగ్గు నవ్వులు ''కంటిన్యూ'' నవ్వులు, మాయలపకీరు నవ్వులు ఏడిపించే నవ్వులు, ఆమోదం తెలిపే నవ్వులు, నిరసన నవ్వులు, వేదాంతపు నవ్వులు... ఇలా ఎన్ని ఉన్నాయో!!
ఒక్కొక్కసారి ఇతర రసాల వల్ల కూడ హాస్యం వస్తుంది. దీనినే రసాభాస అంటారు. భారతంలో ఉత్తర కుమారుడు చూపించే వీర రసాభాస నవ్వు తెప్పిస్తుంది. ''ఇప్పుడు నేను మిమ్మల్ని నవ్విస్తాను'' అంటూ మాట్లాడినపుడు మనకి నవ్వు రానప్పుడు... అతన్ని చూసి నవ్వుకుంటాం.
హాస్యం దివ్యౌషధం అంటారు. మనసారా నవ్వగల వాడే మనిషి అన్నారు. Laughter makes good blood అనటమూ వుంది.
- డా.ద్వా.నా శాస్త్రి
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment